Friday, December 28, 2012

చందమామ రావే - ఇంకా ఎవరైనా పాడుతున్నారా?

ఈ రోజు పౌర్ణమి.ఎందుకో ఈ మధ్య పౌర్ణమి అంటే కొంచెం దిగులుగా ఉంటుంది. "చంద్రమా మనసో జాతః" అని ఎందుకన్నారో కానీ, రేపటినుండి ఆకాశంలో చంద్రుడు ఆలస్యంగా వస్తాడని బాధ. నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేసరికి అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చే నా కూతురుకి ఇప్పుడు ఏ చందమామని చూపించి "చందమామ రావే" అని పాటపాడాలి? ప్రతిరోజూ ఒకే టైమ్ కి చందమామ ని పరిశీలిస్తూ ఉంటాము నేను, మైథిలీ. విదియ రోజు ఏడింటికి పడమర దిక్కున చివరి మెట్టు మీద ఉన్నట్టు కనపడే ఆయన రోజులు గడిచే కొద్దీ నడినెత్తి మీదికి వస్తాడు, పౌర్ణమికి తూర్పుకి తిరుగుతాడు. అప్పుడు పైన స్లాబ్ అడ్డు వస్తుంది కదా, అప్పుడు మైథిలి చందమామని వెతకడానికి పడే పాట్లు చూడాలి. అటు తిరిగి,ఇటు తిరిగి, ఆ చివరికి పోయి, ఈ చివరికి పోయి, మెట్లు ఎక్కి, దిగి, చివరికి మెట్లు పైదాక ఎక్కి చూస్తే కనపడతాడు. అప్పుడు ఆ పసిపిల్ల ముఖంలో కనపడే ఆనందం ఎంత హాయిగా ఉంటుందో. నిండా పదహారు నెలలు లేవు, ఏమర్ధమవుతుందో, ఏమనిపిస్తుందో మరి చందమామని చూస్తే. మనవరకు ఎందుకు సుందరకాండలో ఆ స్వామికే ఉత్తేజాన్నిచ్చి, సాచిర్యం చేసాడాయన. 



చెయ్యెత్తి చందమామని పిలిచినా, చేతిలో ఏమన్నా ఉంటే చందమామకి పెట్టమంటే చెయ్యి సాగదీసినా , దా దా అని చందమామని పిలిచినా, చందమామకి టాటా చెప్పమంటే చెయ్యి పదహారు వంకలు తిప్పి టాటా చెప్పినా పసిపిల్లలకే చెల్లు. అందుకేనేమో మతంతో సంబంధం లేకుండా పిల్లల్ని దేవుడితో  పోల్చారు పెద్దలు. సనక సనందాదులు, ప్రహ్లాదుడు ఐదేళ్ళవారు. మీరు పసిపిల్లలలాగునైతేనే దేవునిరాజ్యంలోకి ప్రవేశించగలరు అన్నది బైబిల్. ఒక్కసారి బయటికి వచ్చి మీ కుటుంబంతో సాయంత్రం పూట డాబా మీద కూర్చుని పున్నమి చంద్రుని వెన్నెలలని అనుభవించండి. వేలరూపాయలు తగలేసి వెలిగించే డిస్కో లైట్లు వాటిముందు దిగదుడుపే.

ఎప్పుడైనా సాయంత్రం పూట రోడ్డుమీద నడుస్తూ ఉంటే తల పైకెత్తి చందమామని చూస్తూనో, లేకుంటే వెతుకుతూనో ఉంటుంది. ఉంటే మొహం వెలిగిపోతుంది. లేకుంటే చిన్నగా అయిపోతుంది. అలా తల పైకెత్తి చందమామని వెతుకుతుంటే  సుందరకాండలో స్వామి సముద్రాన్ని దాటడానికి గరుత్మంతుడిని తలచుకుని తల పైకెత్తి నిలుచున్న సన్నివేశం గుర్తు వస్తుంది.

అందుకే పౌర్ణమి అంటే నాకు దిగులు. రేపటినుండి చందమామ కనపడక మొత్తం వెతికొచ్చి చేతులు తిప్పుతూ "పొయ్,పొయ్" అని చెప్తుంది? (తన బాషలో పోయింది  అని). ఏం చెయ్యాలి?

Saturday, September 15, 2012

మరువబోకు మానవుడా మమత వీడరా

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
రామాయణంలో చాలాసార్లు, వాల్మీకి మహర్షులు జంతువులతో పోలిక చెప్పారు.సింహ మధ్య అనీ, శార్దూల విక్రముడనీ ఇలా. కొన్ని విచిత్రమైన పోలికలు ఈ రోజు.
సుందరకాండలో స్వామి లంకాప్రవేశం చేసేముందు తన శరీరప్రమాణాన్ని చాలా తగ్గించారు. ఎంత అంటే పిల్లిపిల్ల అంతగా తగ్గించారు. ఇంతవరకూ చెప్పి ఊరుకోలేదు మహర్షి. "భభూవాద్భుత దర్శనః" అని విడిచిపెట్టారు. దర్శన సామర్ధ్యం చాలాబాగా ఉన్న పిల్లి ప్రమాణానికి తన శరీరాన్ని తగ్గించారు అని చెప్పి మెలిక పెట్టారు. ఇంతేనా ఈ మాటకర్ధం? కాదన్నారు పెద్దలు. గురువుగారు చాలాసార్లు చెప్తూ ఉండేవారు, రామాయణాన్ని రకరకాల కోణాల్లోనుండి అర్ధం చేసుకోవచ్చు అని. అప్పలాచార్య స్వామి వారు కూడా రామాయణాన్ని కావ్యంగా, కధగా, తత్వశాస్త్రంగా మూడురకాలుగా చూడవచ్చు, చూడాలి అని చెప్పేవారు.
 అలా చూస్తే, అప్పుడు అద్భుతం అనేమాట కీలకమౌతుంది. అధ్బుతం అనేమాటకి  భగవంతుడు అని అర్ధం ఉన్నదని శ్రీభాష్యం వారు ఒకసారి చెప్పారు. అలాంటి అధ్బుతమైన దాన్ని దర్శించడానికి వెళ్తున్నాడు అని చెప్పకనే చెప్తున్నారు. ఇక అలాంటి అద్భుతాన్ని చూడడం సాధ్యమయ్యేది, మనలని మనం తగ్గించుకున్నప్పుడే. నేను అనే భావనని తగ్గించుకుంటేనే. నిన్ను నువ్వు తగ్గించుకుంటే తరుగు లేని అద్భుతాన్ని దర్శించడానికి అర్హతని సంపాదించుకున్నట్టే అని సుందరకాండ సందేశం.

బైబిల్ లో ఒకమాట ఉంటుంది, "తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును"  ఇదే స్వామి సుందరకాండలో చేసి చూపించారు, వాల్మీకి రాసి చూపించారు. ఆత్మ దర్శనానికి వెళ్ళేవాడు దేహాభిమానాన్ని ఎంత తగ్గించుకోవాలో చెప్పే శ్లోకం ఇది.
సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతిః!
పృషదంశక మాత్రస్సన్ భభూవాద్భుత దర్శనః!!
ఇక రాత్రి అనేదాని గురించి గీతాచార్యులు చెప్పేవారు ఉన్నారు. మాములు వారికి పగలు, జ్ఞానికి రాత్రి, మాములు వారికి రాత్రి జ్ఞానికి పగలు. బాహ్యార్ధంగా చూస్తే మామూలు జనాలు నిద్రించేటప్పుడు జ్ఞాని మేల్కొని ఉంటాడు అని అర్ధం వస్తుంది. కానీ అంతరార్ధం కోసం పెద్దలు చెప్పిన వ్యాఖ్యానాలు చూస్తే మరో విషయం తెలుస్తుంది. మామూలు మనిషి పగటిపూట వేటిని చూసి ఆనందపడతాడో వాటిని జ్ఞాని పట్టించుకోడు, మామూలు మనిషి పట్టించుకోని భగవంతుని మాత్రం జ్ఞాని ఎప్పుడూ దర్శిస్తూ ఉంటాడు.
ఇలా చాలా ఉన్నాయి. అసలు ప్రకృతిలో ప్రతి వస్తువు, ప్రతి జంతువు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉంటుంది. మనం తెలుసుకోగలమో లేదో అని ఋషులు సరళం గా వాటిని కావ్యాలుగా, పురాణాలుగా, ఇతిహాసాలుగా ఇచ్చారు. ఇవి కూడా అర్ధం చేసుకోలేకపోతే అని రామనామాన్ని ఇచ్చారు. రామ రామ రామ అని జపిస్తుంటే ప్రకృతి మాయ పొరలు పొరలుగా విడిపోతుంది. అన్నీ వాటంతటే అవే ద్యోతకమవుతాయి. జ్ఞాని ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటే, భక్తుడు అప్రయత్నంగా, భగవంతుని విభూతిగా దేన్నైనా అర్ధం చేసుకోగలడు.  ఉదాహరణకి ఒక చీమ చూడండి. ఎన్ని సార్లు కిందపడ్డా తన గమ్యం చేరేవరకూ వదలదు. పొద్దున్నుండీ, సాయంత్రం దాకా అయినా ప్రయత్నిస్తూనే ఉంటుంది. తనకేదన్నా దొరికితే అందరికీ చెప్పి అందరినీ తీసుకొస్తుంది. మొత్తం నాకే అని ఊరుకోదు. సద్గురువులు కూడా అంతే. తాము కష్టపడి సాధించిన జ్ఞానాన్ని దాచుకోరు. అర్హుడైన శిష్యుడు దొరికితే ఆ అమృతవాణి  గంగా ప్రవాహంలా వెలివడి లోకాన్ని ఉద్ధరిస్తుంది. 
ఒక శక్తి ప్రయోగం నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక పదిలక్షలసార్లు రామనామజపం చేస్తే ఏ శక్తి నైనా ఎదుర్కోవచ్చు. రామనామం, మనసుని ప్రశాంతం చేస్తుంది. తమస్సుతో నిండి ఉండే మనస్సనే నది, స్వచ్చంగా ఎలా వాల్మీకి కి దర్శనమిచ్చిందో అలా మన మనస్సే మనకు అద్దమై మనమేంటో చూపిస్తుంది. లోకమేంటో చూపిస్తుంది. లోకంలో సాధించాల్సింది ఏమిటో చూపిస్తుంది. ఎలా సాధించాలో చూపిస్తుంది.ఏది అడ్డమో చూపిస్తుంది. నిజానికి పంచాంగ చూడటంలో కూడా అర్ధం ఇదేనని పెద్దలు చెప్పారు. నేనెవరిని, ఎవరికి చెందినవాడిని, ఏమి సాధించాలి, ఎలా సాధించాలి, ఏమిటి అడ్డు అనే ఐదింటిని గురించి నిత్యం ఆలోచించమని పంచాంగం చెప్తుందట. మనం కూడా ఆ ఆలోచనని పెంచుకుని రామనామాన్ని మనసులో నింపుకుని జీవన్ముక్తులౌదాము.


నా భార్యకి పండరి భజన నేర్పిన గురువులు పల్లా వెంకటేశ్వర్లు గారు పాడిన ఒక పాట.
మరువబోకు మానవుడా మమత వీడరా!(౩)
ఆ మమత వీడి రామనామ స్మరణ చేయరా!
స్వామి స్మరణ చేయరా,స్వామి స్మరణ చేయరా

రామనామ స్మరణ చేసి ఆత్మసుఖము పొందరా!
ఆత్మసుఖము కన్న మరి పుణ్యమే లేదురా!!

మానవధర్మమ్ము వదిలి దానవుడవు కాకురా!
మాయకు లోబడితె నీవు మానవుడవు కావురా!!

ఒహో!! ఉన్నదానితోనే నీవు తృప్తి పొంది సుఖపడరా!
తృప్తి లేని మానవుడా, భస్మమై పోదువురా!!

అయ్యో!! నాది నీది యనే మూఢ తత్వము విడనాడరా!
వెదకి చూడ జగతిలోన ఏది నీది కాదురా!!


మరువబోకు మానవుడా మమత వీడరా!
ఆ మమత విడచి రామనామ స్మరణ చేయరా!

అయ్యో!! అప్పుడిప్పుడనగరాదు ఎప్పుడు ఏ వేళలో !
ఓ! తనువు వెళ్ళె వేళలోన దగ్గరెవ్వరుండరురా!!

అయ్యో!! ఆలుబిడ్డలన్నదమ్ములు, వెంట ఎవరు రారురా!(౨)
వదలలేక వచ్చినా వల్లకాటివరకేరా!!


మరువబోకు మానవుడా మమత వీడరా!
ఆ మమత విడచి రామనామ స్మరణ చేయరా!

చుట్టు నాల్గు గోడలలో ఇమిడి ఉన్న పుట్టరా!
పుట్టలోన తాచుపాము బుసలు కొట్టుచుండురా!!

అయ్యో!! కట్టెలే చుట్టాలురా, కాష్టమే ఇల్లురా!

ఓహో!! కట్టెలే చుట్టాలురా, కాష్టమే ఇల్లురా!
 అగ్నిదేవుడే మనకు ఆత్మబంధుడురా!!

హరేరామ హరేరామ హరేరామ యనరా!
హరేరామ యనినంతనే హరియించును పాపములు!!


మరువబోకు మానవుడా మమత వీడరా!

ఆ మమత విడచి రామనామ స్మరణ చేయరా!!
స్వామి స్మరణ చేయరా,స్వామి స్మరణ చేయరా !!


సర్వం శ్రీ సీతారామ చంద్ర పరదేవతా పరబ్రహ్మార్పణ మస్తు..

Wednesday, July 4, 2012

గురువు



గురువంటే ఎవరు? శాస్త్రాలు చాలాచెప్తున్నాయి. నాకున్న శాస్త్రజ్ఞానం పరిమితం కాబట్టి వాటిని ఉటంకించడంలేదు. నాకున్న తెలివిలోనుండి గురువు గురించి నాకు తెలిసిన మాటలు రాస్తున్నాను. అయినా నాకున్న తెలివి అని మాట్లాడేవాడికి గురువు గురించి మాట్లాడే అర్హత ఉంటుందా? అందుకే ఆ స్వామి పలికిస్తున్నారన్న నా నమ్మకం చెప్పినట్టు రాస్తున్నాను. నా ఇంట్లో, గురువు హోదాలో నన్ను చెయ్యి పట్టుకుని నడిపించిన వారి గురించి ఈ టపా!

          ఎవరికైనా ప్రపంచంలో మొదటి గురువు అమ్మ అంటారు. కానీ ఎంత ఊహ తెలిసిన తర్వాతైనా ఆ విషయాన్ని పట్టించుకోము. ప్రపంచంలో అమ్మ ఒకటే "నా ఆయుష్షు కూడా పోసుకుని బతకరా" అంటుంది. మొన్ననే గూగుల్ ప్లస్సులో ఒక పోస్ట్ చదివాను. "తినవలసిన మనుషులు నలుగురు ఉండి, ముగ్గురికి మాత్రమే సరిపడా తిండి ఉన్నప్పుడు, ఏమాత్రం ఆలోచించకుండా నాకీరోజు ఆకలిలేదని అనే వ్యక్తి ఒక్క అమ్మ మాత్రమే". నిజం కూడా. అత్తా, తోడికోడలు తిండి కూడా పెట్టకుండా మాడ్చుతుంటే, భర్త దూరదేశంలో ఉంటే, కాన్పు తర్వాత పచ్చడి మెతుకులు తినవలసి వచ్చినా, తన కొడుకుకి మాత్రం పాలపొడి డబ్బాలు తెమ్మని భర్తని సాధించింది ఒక తల్లి, పాలు లేనప్పుడు మరో తల్లి గోమాత పాలు తెచ్చి పట్టింది. నెలల పసిగుడ్డుని భుజాన వేసుకుని పొలం పనులకి వెళ్ళింది ఆ మహాతల్లి. ఆవిడ ఏమి చదుకోలేదు, స్వార్ధం, త్యాగం లాంటి మాటలు కూడా తెలియవు. ఐతేనేం, తన బిడ్డలు బాగా బతకాలన్న స్వార్ధం, తన బిడ్డలకోసం ఏమైనా వదులుకోగల త్యాగం ఆమె సొంతం.

                  అందుకే ఆమెని సనాతన ధర్మం తొలిగురువుని చేసింది. దక్షిణామూర్తి ఏ రకంగానైతే "మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వమో" తల్లి కూడా అలాంటిదే, ఒక్కనాడు నోరు విప్పి జ్ఞానబోధ చెయ్యదు. కాని మనసు పెట్టి ఆ తల్లిని అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఎన్ని తెలుస్తాయో. సకలవేదస్వరూపం అమ్మ. తన బిడ్డలకోసం లోకం మొత్తంతో పోరాడగల ధనుర్వేద ధురంధరి ఆమె. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఎన్నని చెప్పగలం? ఎన్నని , ఏమని ఎన్నగలం తల్లి ప్రేమని.

అందుకే "మాతృదేవోభవ".

                           సహజంగా లోకంలో ఒక నానుడి ఉంది. తల్లి నిజం, తండ్రి నమ్మకం అని. కానీ ఆ స్థాయిని దాటి తండ్రికి గురువు స్థానం ఇచ్చింది సనాతన ధర్మం. అంటే తన బిడ్డ భాధ్యతయుతంగా పెరగాలని కోరుకోవడమే కాదు, పెరిగేలా చెయ్యాల్సిన ప్రాధమిక భాద్యతని కూడా తండ్రి మీదనే ఉంచింది ధర్మం. నివురుగప్పిన నిప్పులా ఉంటూ, ఎన్ని బాధలు ఎదురైనా గుట్టుగా ఉంటూ తినడానికి తిండి లేకపోయినా తన బిడ్డ మాత్రం మంచి చదువు చదవాలని కోరుకుంటాడు, ఉన్నతజీవితం అందాలని ఆశపడతాడు. అందుకోసం తను నిలువెల్లా కరిగిపోయినా బాధపడడు. ఒకతండ్రి తను చదవలేకపోయి మధ్యలో ఆపేసిన చదువుని తన బిడ్డలకి అందించాలని తన కోరికలన్నీ చంపుకుని ఒక యోగిలా బతికాడు. వారు ఒక ఒడ్డుకి చేరుకున్నాక తను వెనక్కి తిరిగి చూసుకుంటే వారికోసం తిన్న ఢక్కామొక్కీలే తప్ప తమకంటూ ఏమీ మిగలదు. అయినా ఆయన బాధపడడు. పైపెచ్చు ఏమీ అనుభవించకపోయినా అన్నీ తానే అనుభవించినట్టు గర్వంగా చెప్పుకుంటాడు, అన్నీ అందరికీ ఇచ్చేసి పులిచర్మం కట్టుకుని మిగిలిపోయిన పరమశివుడిలా....

అందుకే పితృదేవోభవ!

ఇక గురువు, గురువు గురించి చెప్పేటంత పెద్దవాడినికాదు కానీ, ఈ పరంపరలో కనపడకుండా పోయిన మరో గొప్పవ్యక్తి గురించి కూడా చెప్పాలి. పరంపరలో కూడా చేర్చవలసిన విషయం(అని నా అబిప్రాయం). అదే

భ్రాతృ దేవోభవ!

                 తల్లీ,తండ్రీ, గురువు, దైవం వీరికిచ్చిన గొప్పదనం నిర్ద్వంద్వంగా అంగీకరించవలసిందే, కానీ సోదరుడు కూడా అంత గొప్పవాడే అని నా అభిప్రాయం. తల్లి తర్వాత తల్లిలా, తండ్రి తర్వాత తండ్రిలా నీడలా ఉండి కాపాడేవాడు అతను. మారుమూల పల్లెటూళ్ళో తల్లితో పాటు అవమానాలను దిగమింగుతూ కూడా తన తోబుట్టువులను కంటికి రెప్పలా చూసుకున్నాడు నా అన్నయ్య. యశోదమ్మ అంటుంది భాగవతంలో, ఏ సిద్ధాశ్రములం తొక్కితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో నేటికి మన భాగ్యశేషంచేత బిడ్డ దక్కాడు కదా అని. ఎంతో భాగ్యశేషం ఉంటే తప్ప గొప్ప అన్నకూడా దొరకడు. అమ్మ పొలంపనులకి వెల్తే పసిగుడ్డుని భుజాన వేసుకుని తిరిగాడు, స్కూలుకి రానీయకపోతే స్కూలుని వదిలేశాడు కానీ నన్ను వదలలేదు. నేను విసర్జించిన అవశేషాలని పెద్దవాడైయ్యుండి కూడా కడిగాడు. నాకోసం ఎంతోమందిని ఎదిరించాడు. ఇద్దరి చదువుకి ఆర్ధికస్థోమత సరిపోదని తన చదువుని కూడా వదిలాడు, తద్వారా తను పొందవలసిన ఉన్నత జీవితాన్ని నాకు భిక్షగా వేసాడు నా అన్న. ఈ రోజున ఒక ఇంజినీర్ గా సమాజంలో నాకు గుర్తింపు ఉందంటే అది నా అన్నయ్య నాకు పెట్టిన భిక్ష. ఒక పిల్లి తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు, కోడి తనపిల్లల్ని భద్రంగా రెక్కలకింద దాచుకున్నట్టు, సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా, జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నావని అన్నా భరించి నాకు నీడై నిలబడ్డాడు. నాలో చదవడం అనే ఒక ఆసక్తికి బీజం వేసినవాడు ఆయన.



నాకు తెలిసిన ఇంకో అన్న, తల్లితండ్రులు పోయిన తర్వాత తమ్ముడిని ఉన్నత చదువులు చదివించాలని కోరుకున్నాడు, అన్నీ కుదిరినప్పుడు అలా అనుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ తనకే పూటగడవడానికి ఇబ్బందిగా ఉండి, తను చూసుకోవలసిన కుటుంబం ఉండి కూడా తమ్ముడిని ఏ కూలి పనులకో పంపకుండా దైర్యం చెప్పి చదివించాడు, అనారోగ్యకారణాలచేత పరీక్ష తప్పితే ధైర్యం చెప్పి, చదువుకోవడానికి పంపాడు. స్ఫూర్తిగా నిలిచాడు. ఈరోజున అతను ఒక గొప్ప స్థాయికి చేరిన తర్వాత అతని నుండి ఏమీ ఆశించకుండా అదే మారుమూల పల్లెటూళ్ళో ఉండిపోయాడు.

అందుకే పితృపంచకంలో అన్నని కూడా చేర్చింది సనాతన ధర్మం. అందుకే మరొక్కసారి



భ్రాతృదేవోభవ..........