Showing posts with label వేయి పడగలు.. Show all posts
Showing posts with label వేయి పడగలు.. Show all posts

Thursday, February 8, 2018

వేయి పడగల విశ్వనాధుడు

జై శ్రీరాం!
శ్రీ రామదూతం శిరసా నమామి!!

ఇప్పుడే విశ్వనాధ వారి వేయి పడగలపైన కిరణ్ ప్రభ గారి రేడియో టాక్ షో విన్నాను. మొత్తం తొమ్మిది భాగాలు. వేయి పడగల వెనక విశ్వనాధ వారి వ్యక్తిగత అనుభవాలు,అవసరాలు, ఆశయాలు, వారి వారసులు, సమకాలికుల అభిప్రాయాలు కూడా తెలిపారు.

వేయి పడగలలోని ప్రతి పాత్ర గురించి , ప్రతి సన్నివేశం గురించి, ప్రతి కవిత్వరూపం గురించి, చాలావరకు చర్చించారు. బడ్డీ కొట్టు నాయర్ పాత్ర చిత్రణ గురించి, కొడాలి ఆంజనేయులు గారి గురించి, కాలేజిలో రాజీనామా చెయ్యడం గురించి, ధర్మం గురించి, కాలప్రవాహం గురించి, పసిరిక, గిరిక వంటి పాత్రల చిత్రణ వెనుక ఆయన ఆలోచన గురించీ. చాలారోజుల తర్వాత మళ్ళీ సుబ్బన్నపేట వెళ్ళి వచ్చినట్టుంది. పాత్ర చిత్రణల గురించి, వాటి వెనుక ఉన్న అప్పటి సామాజిక పరిస్థితి గురించి చాలా సుధీర్గ్ఘంగా వివరించారు. 
గిరికా మహాదేవి, హరప్పా నాయుడు నాకు చాలా ఇష్టమైన పాత్రలు.  
పుట్టుక ప్రధానం కాదు, ఒక మహోదాత్తమైన ఆశయం కోసం ప్రయత్నించడం , అవసరమైతే దానికోసం ప్రాణాన్ని తృణప్రాయంగా వదలగల మహాతల్లి గిరికమ్మ

తన తల్లి చెప్పిన మాటకి కట్టుబడి, తన జీవన లక్ష్యాన్ని అర్ధం చేసుకుని, ఆ లక్ష్యం సాధించాక జీవితాన్ని తనంతట తాను యోగ మార్గం లో వదలగలడం ఇవన్నీ హరప్ప నాయుడు సొంతం. 

లింక్

http://www.koumudi.net/talkshows/index.htm
https://goo.gl/M6BdjI

Saturday, June 26, 2010

వేయి పడగల నీడలో నేను - ౩

జై శ్రీ రామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!
చాలారోజుల తర్వాత వేయి పడగల జ్ఞాపకాల దొంతరను కౌటిల్య గారు కదిలించారు. సరే వేయి పడగలతో నా అనుబంధాన్ని గుర్తు చేసుకుందామని ఈ పోస్ట్ రాస్తున్నాను.

అసలు గ్రాంధికం మనం చదవగలమా లేదా అని ఉన్నరోజుల్లో ఈ పుస్తకం చదవడం జరిగింది. మొదట భావం కోసం చదివాను.రెండోసారి భాష కోసం చదివాను. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణంతో చదివాను. అన్నింటికన్నా నాకు చాలానచ్చినవి కళ్యాణోత్సవాలే. అందులో గోపికయై తల్లి గిరిక వెతుకుతూ చెట్టునూ పుట్టనూ అడగడం , ఆ పద్యాలు నాకెంతో ఇష్టం అప్పట్లో. అందులో ఒకగద్యం ఉండేది. అన్ని పూల చెట్లు,పళ్ళ చెట్ల పేర్లు ఉండేవి. అలాగే "పున్నాగ కానవే, పున్నాగవందితు! తిలకంబ కానవే తిలకనిటులు" అనేపద్యం చాలా బాగుండేది. భాగవతంలోనివని అప్పుడు తెలియదు కానీ ఏదో సంబరంగా ఉండేది ఆ పదాలూ అవీ చదువుతూ ఉంటే. "..సఖీజన వంచితమహం..." అనే అష్టపది కూడా ఉండేది. ఇక అసలు పద్యం "నల్లని వాడు పద్మ నయనమ్ములవాడు" అప్పటికి పాత సాహిత్యంలో పేర్లే గాని విషయం తెలియదాయె. ఆయనేమో ఎప్పుడు చెప్పినా మొదటి పాదం చెప్పి ఊరుకునేవాడు. ఇక చూస్కోండి. ఎవరినైనా అడుగుదామంటే నా సర్కిల్ లో ఎవరికీ తెలియదాయె. అలా రెండుసంవత్సరాలు గడిపేసాక బ్లాగుల పుణ్యమా అని తెలుసుకున్నాను. అసలు ఆ పదబంధాలే వింతగా ఉండేవి. అలాగే "శాస్త్ర ద్రష్టయే గాని శాస్త్ర స్రష్ట గాడు" లాంటి వాక్యాలు కొత్తగా ఉండేవి.
మూడు వందలు యేళ్ళు వేయి పడగలకింద సురక్షితం గా భూమ్యాకాశాలకూ,మంచీ చెడులకూ , మర్త్యామర్త్యాలకూ మధ్య స్థిరంగా నిలిచిన నాలుగు స్థంబాల మంటపం ,చివరికి రెండు పడగల కింద,రెండు స్థంబాలమీద నిల్చున్న స్థితికి సాక్షీభూతం గా నిల్చోబెట్టేస్తారు విశ్వనాథ గారు మనలని. మనలనే నిర్ణయించుకోమన్నట్టుండేది ఆ రెండు పడగలనన్నా స్వామి ఉపసంహరించుకోకుండా కాపాడుకోవడానికి ఏం చెయ్యాలో.
మనం చదివే ప్రతీ పుస్తకం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన మీద ప్రభావం చూపుతుందన్నది నిజం. ఏదో ఒక సిద్ధాంతం మీదనో , విషయం మీదనో అది మన మనసును ప్రభావితం చేస్తుంది. కానీ అన్ని మానవీయ సంబంధాల పట్ల పాఠకుడి దృక్కోణాన్ని మార్చగల శక్తి రామాయణం తర్వాత వేయిపడగలకుందని నా నమ్మకం. ముఖ్యంగా ప్రేమ, పెళ్ళి.
అలాగే మనం చదివే ప్రతి పుస్తకం, తర్వాత మనం ఎలాంటి సాహిత్యం చదువుతాము అనేది కూడా నిర్ణయించుకోవడానికి గీటురాయి అవుతుందని నా అభిప్రాయం. వేయి పడగలు చదివాక ఆ స్థాయి పుస్తకం కోసం చూస్తాం కానీ మామూలు పుస్తకాలు చదవాలని అనిపించదు. సహజకవి చెప్పినట్టు మందార మాధుర్యముల దేలు మధుపమ్ము పోవునే మదనములకు అన్నట్టు అయిపోతుంది.

ఇంకెందుకాలశ్యం ఎక్కడో హృదయపు అట్టడుగు పొరల్లో కూరుకుపోతున్న మీలోని పాఠకుడిని వేయి పడగలు ఊతమిచ్చి పైకి లేపండి. నా తరం లో చాలా మందికి వేయి పడగలు పేరే తప్ప కనీసం ఏముందో కూడా తెలియదు.కొంతమందికి ఎక్కడో విన్న గుర్తు. కొంతమందికి ఆ అదృష్టంకూడా లేదు. నా ఉద్దేశ్యంలో వేయి పడగల గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెయ్యి సంవత్సరాలు మనవలసిన దీపాన్ని వంద సంవత్సరాలకే కొండెక్కకుండా , ఆ దీప కాంతుల్లో జీవితాన్ని ఎలా వెలిగించుకోవచ్చో తర్వాతి తరాలకు చెప్దాం రండి.

Friday, February 6, 2009

వేయి పడగల నీడలో నేను-2(గిరిక)

"ఒక పుస్తకంపై సమీక్ష రాయడానికి కావలసిన అర్హత ఏంటి? " ఈ ప్రశ్న ఏప్పటినుండో నా మనసుని తొలచేస్తుంది.నా వరకైతే ఆ పుస్తకాన్ని ఆమూలాగ్రంగా చదవడమే ఆ అర్హత . అలా అయితే వేయి పడగలు మీద నేను సమీక్ష రాయవచ్చు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చిన పుస్తకం అది.
వేయి పడగలు నన్ను రెండు విధాలుగా మార్చింది.ఒకటి-ఆధ్యాత్మికంగా,రెండు -వ్యక్తిగా .
వ్యక్తిగతమైన అభివృద్ధిని ఇంకొక టపాలో వివరిస్తాను.
మొదట ఆధ్యాత్మికంగా -
దైవానికి నాకు దూరం పెరుగుతోంది అని మొట్టమొదటి సారి బి.టెక్ లో ఉన్నప్పుడు అనిపించింది.ఎందుకు,ఎవరి వల్ల అని చాలా ఆలోచించాను.నా వల్లైతే కాదు అని ఒక సారి, ఏం జరిగినా నా వల్లే జరిగి ఉంటుంది అని ఒక్కొక్కసారి అనిపించేది. ఆ సమయంలోనే వేయి పడగలు చదివాను.
మహాతల్లి గిరిక నా మనసును కదిలించింది.నాకు మళ్ళీ మార్గనిర్దేశం చేసింది.అప్పుడే మహాతల్లి గిరికతో పాటు ధర్మరావు గారిని నేను కూడా గురువుగా మనసా స్ధాపించుకొన్నాను.నేను కూడా కళ్యాణోత్సవాలకోసం వేయి కన్నులతో ఎదురుచూశాను.వేయిపడగలు పుస్తకం అంతా ఒక ఎత్తు వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాలు ఒక ఎత్తు.సుబ్బన్నపేటలో నాగేశ్వర స్వామిని మొదటసారి చూసినప్పుడు అరుంధతికి కలిగిన అనుభూతి లాంటిది కలిగింది ఆ కళ్యాణోత్సవాలు చదువుతుంటే. ఎన్ని సార్లు చదివినా జరిగిన పెళ్ళిని మళ్ళీ వీడియో లో చూస్తున్న అనుభూతే కలిగేది.పదకొండు రోజుల కళ్యాణోత్సవాలు, దశావతారాలు . ఉత్సవాలు పూర్తయ్యేసరికి స్వామి అన్ని అవతరాలను నా కళ్ళ ముందే ధరించినట్లనిపించింది. మనకు ఒక కల్పం బ్రహ్మ కు ఒక రోజు ఎలా అవుతుందో అనుభవపూర్వకంగా తెలిసింది. ఎందుకంటే సుబ్బన్నపేటలో పదకొండు రోజులు అనంతపురంలో మూడు రోజులే అయ్యాయి కదా.

గిరికాదేవి మత్స్యరూపిణి అయినపుడు ఆమెతో కలిసి స్వామి కోసం సాగరగర్భాన్ని శోధించాను. గిరికా దేవి కూర్మరూపిణి అయినపుడు స్వామి ఎక్కడ మంధర పర్వతాన్ని మోయలేక కందిపోతాడో అని ఆమెతో పాటు నేను తల్లడిల్లాను. ఇలా ప్రతి అవతారంలోనూ గిరిక తోపాటు నేను ఆ స్వామికోసం ఎదురుచూసాను.
కళ్యాణోత్సవాల ముగింపురోజున స్వామి గిరికతోపాటే నన్ను అనుగ్రహించాడు.నా చర్మచక్షువులకి ఙ్ఞాన దృష్ఠిని ప్రసాదించాడా అనిపించింది.

నేను నీకెప్పుడూ దూరంగా వెళ్ళలేదు, "యతోభావ: తతో దృష్టి:" -అన్న స్పష్టమైన సందేశం క(వి)నిపించింది.


అనుభవైక వైద్యమైన ఈ అనుభవాన్ని అక్షరరూపంలో పెట్టాలని నేను ఎంత ప్రయత్నించినా చేయలేకపోయాను.నాచేతనైనంత ప్రయత్నించాను ఏమైనా ఉంటే విఙ్ఞులు సరిదిద్దగలరు.

Wednesday, October 29, 2008

వేయి పడగల నీడలో నేను. -1

విజయవాడ లో సత్యనారాయణ పురంలో ఒక గ్రంధాలయం ఉండేది రైల్వే స్టేషన్ దగ్గర (ఇప్పుడు లేదు లెండి. లేనిది రైల్వే స్టేషన్ , గ్రంధాలయం కాదు ). అక్కడ చాలా పుస్తకాలు చదివాను. వాటిలో నా దశ తిరిగి ఒక రోజు చలం గారి "మ్యూజింగ్స్" చదవడం తటస్తించింది. తరువాత నేను అనంతపూర్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి మామూలు పుస్తకాలు చదవలేదు. ఏది చదివినా ఆ పుస్తకంతో పోల్చేవాడిని. తక్కువే అనిపించేది. ఇక ఇలా లాభం లేదని విశ్వనాధ గారిని తగులుకొందాం అనుకొన్నా. అదృష్టం కలిసొచ్చి అనంతపూర్ లో బుక్ ఎగ్జిబిషన్ లో "వేయి పడగలు" దొరికింది. వినడం ఐతే చాలా విన్నాం ఆ పుస్తకం గురించి , కాని ఎలా వుంటుందో తెలియదు. తీరా కొన్నాక చదవలేదంటే(అసలు భయం చదవలేమేమో అని) అవమానం. కొందామంటే ౪౦౦ (400). సరే ఏదైతే అదే అవుతుందని కొన్నాను. కాలేజ్ లేదు, కాంటిన్ లేదు, చదువు లేదు, సంధ్య లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ఉదయం లేదు, సాయంత్రం లేదు, నాలుగు రోజుల తర్వాత యజ్ఞం పూర్తి అయ్యింది.
అప్పటి దాకా ఒక అలౌకిక లోకంలో తిరిగిన నన్ను అక్కడి వాళ్ళు తరిమేసారా అనిపించింది. వేణుగోపాల స్వామి కల్యాణం జరిగి సంవత్సరం ఆయినా కాలేదు, అప్పుడే నన్ను పంపించేసారే అనిపించింది. ఇక్కడే గుండేటిలో పడి చావనయినా చస్తాను కాని నేను వెళ్ళాను అని అరవాలనిపించింది. కాని ఊరిలోఎవరు లేరు, అందరు ధర్మారావు గారి పెళ్ళికి బెజవాడ వెళ్ళారు.
అలా వదలలేక , వదిలి వెళ్ళలేక, అశ్రు నయనాలతో సుబ్బన్న పేట ని వదిలి అనంతపూర్ JNTU హాస్టల్ లో వాలాను.

(ఇంకా ఉంది. )

కొసమెరుపు :

"మ్యూజింగ్స్" నేను రండు చాప్టర్ లే చదవడం జరిగింది. ఎందుకంటే అది మనది కాదు. రెండవ రోజు కి లైబ్రరి లో మరి దొరకలేదు. అందుకే వేయి పడగలు కొనుక్కున్నధైనా ఏక బిగిన చదివేసాను.