జై శ్రీరామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!
సురాసురుల మధ్య తగవు తీర్చడానికీ, సురలకు అమృతాన్ని ఇవ్వడానికి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఆడిన వింత నాటకమే మోహినీ అవతారం. ఈ అవతారం మరొక ప్రయోజనం మణికంఠ స్వామి జననం. మోహినీ రూపం దాల్చిన ఆ పరంజ్యోతిని శంకరుడు అనుసరిస్తే
అదే "రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!" అయ్యింది. పరమాత్మ అనుగ్రహంతో ఒకటి రాసిన తర్వాత శంకరుడినే మోహింపజేయగల మోహినీదేవి అవతారం లోకాన్ని కదిలించదా అనిపించింది(అనిపించేది ఎవరికి, అనిపింపచేసేది ఎవరు?).అలా ఆ స్వామి రాయించినవి మిగతావి.
వీటికి చంధో బద్దత లేదు, కానీ మనో నిబద్దత ఉంది
వాక్యశుద్ధి లేకపోవచ్చు, కానీ అంతఃకరణ శుద్ధి ఉంది.
పురుషుడూ,ప్రకృతీ అన్నీ తానే అయ్యి ఆటలాడే ఆ నిర్గుణ పరబ్రహ్మ ని శబ్దం ద్వారా స్పర్శించాలనీ,దర్శించాలనీ చేసిన చిన్న ప్రయత్నం.అంతే తప్ప శారదా పుత్రుల్ని గేళి చేయడానికి మాత్రం కాదు. సలహాలిస్తే చంధస్సులు నేర్చుకొని ఆ పరమాత్మ గుణగణాలను గాన చెయ్యాలని కోరిక.
నాగారివాహన నారాయణుండు,అసు
రగణమచ్చెరువొంద,సుర రక్షణకై ముద
ముగ మోహినిగాగ,భామయైన బావనుగని
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్|
గగన మండలమ్మంత కాంత మేని ఛాయ ముప్పిరిగొనంగ, సురగ
ణాంగనలంబరవీధి చేరి కన్నులింతగ చేసి లోకోత్తర సౌందర్యమున్ చూ
డగ రాగ,భువనభాండముల్ గుసగుసలాడుచుండ,భామయైన బావనుగని
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్|
వజ్రముల్ విసుగెత్తి పలికె,తమకేది అంతటి వన్నె యని,
వైఢూర్యముల్ వదలక వదరుచుండె, ఇది ఎచ్చటి వెలుగని,
మౌక్తికముల్ మారు మాటాడక యుండె, మునుపెన్నడు ఇది గనమని,
నవరత్నముల్ నోరాడక యుండె, ఇక తమనెవ్వరు తలపరని,
అన్ని రత్నముల కాంతిని,
అన్ని లోకముల శాంతినపహరింపనొప్పు
వెన్నుడు మోహిని గాగ, జూచి
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!
సృష్టి ధర్మముగ దివా సంధ్యా నివర్తకుండైన రవిని
వ్యష్టిపరచగ,ముల్లోకమ్ముల తిమిరమ్మును
నష్టపరచ, లోకమ్ముల దీపించుచున్న మోహిని గని
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!
జగత్ప్రళయమో, త్రిశంకు స్వర్గ చంద్రబింబమో యటంచు
నగరాజాధిపు యల్లుడి జటన చేరి సోముడు చాటుగ
దాగి చూడగ, చంద్రబింబ సమభాసమునొప్పు మోహిని గని,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!
ముక్కెరకాంతులు మూడు లోకమ్ముల ముప్పిరిగొనంగ,
ఎక్కడివీ కాంతులనుచు మూడు లోకమ్ముల జనులు మ్రాన్పడగ,
రక్కసులనుండి సుధను, మూడు లోకమ్ముల గావగ దిగిన కాంతను గని,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!
శుభములు దేవాళికిన్ శుభకరముగనిచ్చు విభుడు మోహిని గాగ,
శుభములు మానవాళికిచ్చు,శుభగుడు శోభనమొప్ప మోహిని గాగ,
శుభముగ సుధను,సురలకీయ ఖగరాజపతి వేగ మోహిని గాగ,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!
విరిచూపుల అరివీరుల యశమును వ్యర్ధము గావించుచు,
తరగని తమకమునభినయించి తామసుల దరి జేరుచు,
కరివాహనగణమున్ అమరుల జేయ సుధనిచ్చునువిధగని,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!
Showing posts with label రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్. Show all posts
Showing posts with label రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్. Show all posts
Thursday, June 24, 2010
Subscribe to:
Posts (Atom)


