Showing posts with label దశ రూపకం. Show all posts
Showing posts with label దశ రూపకం. Show all posts

Monday, February 16, 2009

దశ రూపకం-౧౦ వ(పదవ -ఆఖరు) భాగం

౧౦
మందపిల్లి.
౦౭-౧౨-౩౮.
రసరాట్టుగారూ! నాన్నగారు వచ్చారు.మీరు ఏమీ అనుకోకుండా ఉంటే మీకు ఒక సంగతి రాసేసి ఇక్కడితో ఊరుకోమన్నారు.మీపేర నేను పంపిన రచన ఒక పుష్కరం క్రితం మీరే రచించిందట. అది మీరచనలలో కల్లా గొప్పదనే అప్యాయంకొద్దీ నాన్నగారు స్వహస్తంతో లిఖించి, ఆ కాగితం తనదగ్గిర అట్టేపెట్టుగున్నారట,నేను పంపిన రచన అదే అయి ఉంటుందని చెప్పారు. క్షమించండి.

ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౦౮ -౧౨ -౩౮
గోపీనాధానికి అనేక ఆశీర్వచనాలు.నేనూ ఊరెళ్ళి ఈ ఉదయమే వచ్చాను.లోగడ నీకు వచ్చిఉన్న జాబులన్నీ, నేను ఊళ్ళో లేకపోబట్టి మా అమ్మాయి రాసింది.జాబుల్లో ఉన్న వృత్తాంతం యావత్తూ,నువ్వు పంపించిన కాగితాల మీద రాసిఉన్నదే. ఆ రచనా, దస్తూరీకూడా మీనాన్నగారివే. అందులో వారు విమర్శనమోనాలురాసి అట్టే పెట్టుగున్నారు, అది పొరపాట్న ఇక్కడికి వచ్చింది. నా రచన అన్నావే! అది కుంభయ్యగారిచేతికి నిరుడు మీ నాన్నే ఇచ్చారు, ఙ్ఞాపకం చేసుగోమను. అయితే నీకు పెండ్లి అయిందా?.......
ఇట్లు,
రసరాట్

Friday, February 13, 2009

దశ రూపకం- ౯ వ (తొమ్మిదవ) భాగం

మందపిల్లి.
౦౫ -౧౨ -౩౮ .

రసరాట్టు గారూ! క్షమించాలి. మా నాన్న గారు ఉత్తరం రాసారు. రేపో నేడో ఇక్కడికి వచ్చేస్తార్ట. ఒక పని జరిగిందట. నాలుగైదు రచనలు మానాన్నగారు తమ బోంట్లకి విడివిడిగా అభిప్రాయంకోసం పంపించారట.అందులో ఒకటి శ్రీనాధుని రచన కూడా ఉందట. కడం అభిప్రాయాలన్నీ వచ్చేశాయి. ఒక వేళ, దిక్కుమాలి ప్రాలుద్ధం,మీకు నే పంపింది అదే కావచ్చు!
ఇట్లు,
గోపి.


జవాబు
పేరారం,
౦౬ -౧౨ -౩౮
గోపీ! అదా కమామిషూ! హోరీ! చెప్పవేం మరీ! అందుకనే, కిందన మాటు నేనెంత ఏకుతూ రాసినట్టు ఉన్నా,అప్పుడు కూడా ఈ రచనలోని ఆ రసస్ఫూర్తీ, ఆ పద సౌష్ఠవమూ, ఆ భావ విశేషమూ, ఆ గుఱ్ఱపునడకా, ఆ భాషామేళవం, ఆ వగైరాలూ - అవన్నీ తొంగిచూస్తూనే ఉన్నాయి. పెద్దవాళ్ళ రచనలు అనేకం ఇతరుల చేతుల్లో పడి పాడైపోయాయి.
ఇట్లు,
రసరాట్

Thursday, February 12, 2009

దశ రూపకం - ౮(ఎనిమిదో) వ భాగం

మందపిల్లి.
03-12-38.
రసరాట్టుగారూ! శాస్త్రం చెప్పిన తరవాయిగా వచ్చింది. ఎప్పటికప్పుడు మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం కట్టేద్దాం అనుకుంటూండడం,ఏదో పిల్లసమ్మేరీ వస్తూండడం జరుగుతోంది.మీరేమన్నా అనుకుంటారేమో అని ఇదవుతున్నాను కుడానూ! ఈవేళ మరో ఆయన వచ్చాడు. ఇతగాడిపేరు కేతయ్యట. ఆయనకూడా మా నాన్న గారి చేతికి అభిప్రాయం నిమిత్తం తన రచన ఇచ్చాట్ట. మా నాన్న ఊళ్ళో లేరని చెప్పేసి మెల్లిగా ఆయన్ని వొదిలించుగున్నాను. ఘంటారావురచనమీద అభిప్రాయం నిన్న మరొకరి దగ్గర్నించి నాకు వచ్చేసింది.మీదగ్గిరున్న రచన కేతయ్యదే. ఏదో ప్రసంగం వచ్చి , మీకూ తనకీ పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందని కేతయ్య అన్నాడు.
ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౦౪-౧౨-౩౮

గోపీ! ఈ సంగతి రాశావు నయమే. ఇంకాదాచుగుని ఊరుకున్నావుకావు,చచ్చిపోదుం. నాకూ అనిపించింది,'ఏమిరా! కొన్ని లక్షణాలు ప్రశంసార్హంగా కనిపిస్తూఉన్నా, ఈ రచన మొత్తంమీద ఏడిసినట్టుందేమిటీ అని. అల్లా అనిపించడానికి కారణం ఇప్పుడు భోదపడ్డది.
ఇంత దరిద్రగొట్టురచన భూమిమీదగాని,అంగారకుడులో గాని లేదు. బుద్ధిగల వాడెవడూ ఇది చివరంటా చదవడు. అందుకనే నే చదవలేదు. ఇందులో, గాఢంగా చూస్తే, అర్ధం వ్యర్ధం,భావం అభావం,రసం నీరసం,శైలిగాలి,భాషఘోష ,రీతి కోతి, వృత్తి మిత్తి,శయ్య కొయ్య,ధార నార. కొన్ని పట్ల కవి ఏడవబోయాడు. ఆ ఏడుపు ఉచితరీతిగా-అనగా ఏడుపు ఏ రీతిగా ఊండాలో అల్లా లేదు. నన్నడిగితే నేనేనా చెబుదును. చాలా బేస్ధలాల్లో కూడా నవ్వు తెప్పించడానికి ప్రయత్నించి రచయిత చచ్చి చెడ్డాడు.నేనెంత బిగపట్టుగుని కూర్చున్నా ప్రాణంమీది కొచ్చింది గాని నవ్వు రాలేదు. సహజమైన మాటపొందికా సమయస్ఫూర్తీ ఇందులోమృగ్యం. రచననీ , రచయితనీ వేరువేరుగా పుఠాలేసినా ఈ రచన ఇంతే. నుడికారం సుడిలో పడింది, కారకం మారకం చెందింది. నాబోటి గొప్పవాళ్ళనీ కొన్ని గొప్పసంస్ధల్నీ నిరసించడం తప్ప ఇతరం ఏమీ ఇందులో లేదు. ఈ రచనలో కొంత-చిరవదాకా అసలే చదవలేకపోయాను!-చదివి నేను చాలా పాడైపోయాను. నే కాక తక్కినవాళ్లు చదివితే ఎక్కడ చెడిపోతారో అని బెంగతో తీసుగుంటున్నాను. ఇది ఎవరేనా చదివితే పెద్ధ ఒట్టు; జాగ్రత్త!

ఇట్లు,
రసరాట్

Thursday, February 5, 2009

దశ రూపకం -౭ వ భాగం


మందపిల్లి.
౦౧ -౧౨ -౩౮.

రసరాట్టుగారూ!
మీ పేర వ్రాయడం ఏ ముహూర్తాన్ని ప్రారంభించానో గాని సంగతి తెమిలేటట్టు కనపడదు. మరో చిక్కొచ్చింది. పొద్దున్న ఒకాయన నే ఉండగానే మా ఇంటికొచ్చారు. ఆయన పేరు ఘంటారవుట. ఆయనట తన రచన మా నాన్నగారికిచ్చింది. మీకు నేను పంపిన రచన తనదేనని ఆయన పట్టు పడుతున్నాడు. వెనక మీ ఎన్నికల్లో మీ తరఫున పని చేసింది ఈయనేట.
ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౦౨ -౧౨ -౩౮
అబ్బాయి, గోపీనాధం! అల్లా చెప్పు మరీ! అందుకనే తీవ్రంగా చూసిన మీదట ఈ రచన కడుంగడు ప్రౌఢంగా ఉంది. కొన్ని స్ఖాలిత్యాలున్నాయి. ఉంటే ఏం అన్నాను! కొన్ని స్ఖాలిత్యాలు ఉండాలి అని కూడా నేను వాదిస్తాను. లేకపోతే రచన మానుషమే అనిపించుకోదు.ఇది యధార్ధభావాలతోనూ, ఉన్నతాదర్శాలతోనూ నిండి ఉంది. రసం ఇందులో కేవలం ఆవకాయి ఊటలాగ ఊరిపోవడమే కాకుండా సముద్రపు పోటులాగ ఉబ్బి మీద పడిపోతోంది.భాష అతిమధురం.శైలి మనోహరం,వట్టివేళ్ల యొక్క చల్లదనం, వనసంతర్పణపోపుయొక్క ఘుమఘుమా, చలిమిడి యొక్క పాకం ఏకకాలంలో ఇక్కడ దొరుకుతాయి.వేయేల? ఈ రచనలోని మాటలు అన్న జిహ్వే జిహ్వ, విన్నచెవే చెవి,తస్కరించిన కవే కవి.
ఇట్లు,
రసరాట్.

దశ రూపకం - ౬వ భాగం


మందపిల్లి.
౨౯ -౧౧ -౩౮ .
రసరాట్టు గారూ! ఇంతటితో ఊరుకుందాం అంటే వీల్లేని పరిస్థితి ఏర్పడ్డది. నిన్న మా ఇంటికి నే లేనప్పుడు ఒకాయన మా నాన్నగారికోసం వచ్చారని మా అమ్మ చెప్పింది. ఆయన తాలూకు ఒక రచన మీద అభిప్రాయం తెప్పించి ఇస్తానని మా నాన్నగారు వారికి వాగ్దానం చేసి రచన పుచ్చుకున్నార్ట . ఆయన పేరు తెలియదు. చూపులకి కొత్త బియ్యేలా ఉన్నడని మా అమ్మ్మ చెప్పింది. మీకు నేను పంపింది ఆయన రచనేమో!
ఇట్లు,
గోపి.
జవాబు
పేరారం,
౩౦ -౧౧ -౩౮
గోపీ! అసలు నేను మొదట్లోనే అల్లా అనుకున్నాను. ఈ కవి ఇంగ్లీషు చదివినవాడు. ఇంగ్లీషులో తను చదువుకున్నదంతా మక్కికిమక్కి ఇందులో పొట్టిగ్రాఫు దింపేశాడు. ఈ సరుకు ఎక్కణ్ణించీ దిగుమతీ చేస్తున్నాడో చెప్పడు. ఆ సంగతి తెలుగు ఘటాలు ఎక్కడ కనిపెట్టొచ్చారని ఇతని ఊహ. రచనంతా ఇంగ్లీషు కంపే. ఉద్బోధన గాని ఇత్తేజన గాని ఇందులో లేవనడం సాహసం. భాష మాత్రం ఆంగ్లాంధ్రద్రావిడవంగ ధప్పళం.
ఇట్లు,
రసరాట్

Friday, January 23, 2009

దశ రూపకం-ఐదవ భాగం


మందపిల్లి.
౨౭ -౧౧ -౩౮ .
అయ్యా! రసరాట్టు గారూ! తమ జాబు అందింది. మా నాన్నగారు కవిత్వం రచించగలరని మాకు తెలియదు. ఈ రచన ఆయనది కాదేమో! అయినా నమస్కారం.
ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౨౮-౧౧-౩౮
గోపీ! ఇహనేమ్మరీ! నేను అప్పుడే అనుకున్నాను. అందుకనే ఈ రచన రమ్యంగానూ గంభీరంగానూ మాత్రం ఉంది.శైలి మృదుమధురంగానూ, ప్రాయశః భయజనకంగానూ, సర్వత్రా నాతి కఠినపదభూయిష్ఠంగానూ ఉంది. కవి ఇటువంటి రచనలు ఇంకా మేట్లకొలది రాసి, బతికుండగానే అచ్చు కొట్టి, చచ్చో చెడో అందరికీ ఉచితరీతిని వాటిని అందజేసి ధన్యుడై తరించును గాక.
ఇట్లు,
రసరాట్

Thursday, January 22, 2009

దశ రూపకం -నాల్గవ బాగం

మందపిల్లి.
25-11-38.
ఆర్యా! మా నాన్న గారు గ్రామాంతరం వెళ్ళేటప్పుడు ఈ రచన మీద అభిప్రాయంకోసం ఇది మీ పేర పంపించమని నాతో చెప్పారు. అన్నట్టు, మీరు వారికి బాకీ ఉన్న లెఖ్ఖ గురించి వ్రాయమనికూడా అని వెళ్ళారు.

ఇట్లు,
గోపి.
జవాబు
పేరారం,
౨౬-౧౧-౩౮
గోపీ! అల్లా చెప్పుమరీ! అందుకనే ఈ రచన మిక్కిలి ఉత్కృష్టం. కవి కేవల ఛాందసుడు కాడు. ఒకటోరకమైన చాదస్తంలా పైకి కనిపించేది యావత్తూ ఫక్తు చేవ,గుంజు. ఇందులో అపార పాండిత్యం గంగాతరంగాలవంటి నిమ్నోన్నత భావాలలో చదువర్ని ముంచి లేవనెత్తుతుంది. పాండిత్యం ఇంత సద్వినియోగం చేసినవాళ్ళు లేరు.ప్రాచీన సంప్రదాయం ఇక్కడే నిల్చింది. మారుమూల పదాలకి ఈ రచన కాణాచి, అపురూప కారకాలకి ఈ రచన దిక్కు, పురాణేతిహాసాలకి ఈ రచన ధర్మ సత్రం. నేలబారు రోకలిబండ్లు ఎగర్లేని మహోన్నత కవితాగిరిశిఖరాలలోనే ఈ కవివాణి విహరిస్తుంది. గ్రహించే బుర్రలుండాలిగానీ, నవీన విజ్ఞానం అనబడేది కూడా చణక శాస్త్రిగారి ఈ క్రొత్త రచనలో ఉంది. నాదీ పూచీ!
ఇట్లు,
రసరాట్

Monday, January 12, 2009

దశరూపకం-మూడవ బాగం.

మందపిల్లి,
౨౩-౧౧-౩౮
రసరాట్టు గారికి వందనాలు, తమ జాబు అందింది. ఆ రచన నాది కాదు. సలాం.
ఇట్లు,
గోపి.
జవాబు
పేరారం,
౨౪-౧౧-౩౮
గోపీ! నువ్వింకా ఏముటో అనుకున్నాను. తగ్గవాడివే.మొత్తం మీద చణక శాస్త్రుల్లుగారి అబ్బాయి ననిపిస్తున్నావ్. ఆ రచన చెయ్యడంపాటి తెలివితేటలు నీ దగ్గిర లేకపోతే పోనీ అది ఎవరు రాశారో ఆ సంగతేనా నాకు రాయవలిసి ఉంటుందనేనా నీకు ఇంగితజ్ఞానం ఉండకూడదూ ! ఇదుగో:
ఈ రచన మంచిది. భాష చక్కనిది. వస్తువు అందమైనది. రీతి కులాసాగా ఉంది. వృత్తి గౌరవము కలది. ఈ కవికి హిందూస్తానీ కూడా తెలుసు. వెల స్వల్పం. ఫలమధికం,చక్కని సైజు.
ఇట్లు,
రసరాట్.

దశరూపకం-రెండవ బాగం.

మందపిల్లి.
౨౧-౧౧-౩౮
రసరాట్టు గారికి సమస్కౄతులు-------
ఆర్యా! తమ జాబు చేరింది. క్షమించవలె. మొన్న నేను తమకు రాసిన ఉత్తరం పొరపాటు. తమకు ఆ రచన పంపినట్టు జ్ఞాపకముండి అట్లా రాసాను. ఈవేళ తీరా చాకలి తెచ్చిన కోటు తొడుక్కోగా, నా కోటు జేబులోనే ఆ రచన కూడా ఇస్త్రీ అయి ఉండిపోయింది. ఇప్పుడే వేరొక కవర్లో పెట్టి ఆ రచన మీకు పంపాను. ఆ కాగితాలు విప్పేటప్పుడు జాగ్రత్త. నామీద దయ ఉంచి మంచి అభిప్రాయం పంపండి .
ఇట్లు,
గోపి.
జవాబు
పేరారం,
౨౨-౧౧-౩౮
గోపీ! మరొకరికి పంపవలసిన ఉత్తరం నీకు వేసాను. నువ్వు కొంచెం అసాధ్యపు పిల్లకాయలా ఉన్నావు. నువ్వు కవిత్వం గూడా రాస్తావని లోగడ నేనెరగను. ఇదిగో:
ఈ కవి సుప్రసిద్ధ పండితపుత్రుడు. ఇతివృత్తం ఒక మహా పురాణంలో అసలైన పట్టు. కాని, ఈ రచనలో అనుభవం తక్కువ. ఆవేశానికి తుల్యమైన ఆరిందా లేకపోవడం సహజం గనక, లేదు. ఉంటే అడిగారూ! ఉన్న తప్పులు కుర్ర తప్పులు గనక క్షమించవచ్చు. ఈ కవికి భవిష్యంలో మంచి విలవ వస్తుంది. ఇప్పుడైనా, రచన నవనవోన్మేహం, మహామెత్తని శయ్య, పరిశుభ్రమైన ధార. పాండిత్యంలో కనబడే లోటు కూడా కాలక్రమాన్ని, అన్నీ సర్దుకున్నట్టే, సర్దుకుంటుంది. మాంచి అక్కరకొచ్చే చెయ్యి, సవ్య సాచి. భరతమాతకి ఇల్లాంటి సంతానం అవసరం.
ఇట్లు,
రసరాట్.

Friday, January 9, 2009

దశరూపకం - భమిడిపాటి కామేశ్వరరావు

భమిడిపాటి కామేశ్వరరావు గారి మనతెలుగు లోని ఒక చిత్రమైన కధ ఇది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో ఉన్న ఈ కధ ఒక వ్యక్తి మనిషిని బట్టి , స్ధాయిని బట్టి ఎలా ప్రవర్తిస్తాడో చెప్తుంది. మూల ప్రతి పిడిఎఫ్ సరిగా లేనందున పది ఎపిసోడ్లు గా దీన్ని బ్లాగ్ లో రాస్తున్నాను.
మొదటి భాగం
మందపిల్లి
౧౯-౧౧-౩౮
రస రాట్టు గారికి నమస్కారములు -------
మహాశయా! నాన్నగారు మా తోటారం భూముల మీదికి శిస్తు వాసులు వగైరాలకి వెళ్ళారు. పది రోజుల క్రితం తమ పేరట ఒక వచనరచన పంపి ఉన్నాను. మరి ఆలస్యం కానియక దానిమీద తమ సదభిప్రాయం పంపండి. తిరుగు టపాలో పంపాలి.
ఇట్లు,
గోపీనాధం.
జవాబు
పేరారం
౨౦-౧౧-౩౮
గోపినాధానికి ఆశీర్వచనాలు -----
అబ్బాయీఏదో ఆలస్యం అయ్యింది. ఏమీ అనుకోకు. నాకు మీ నాన్న గారొకటీ నువ్వొకటీ కాదు. ఇదుగో:
ఈ గ్రంథం ఆంధ్రానికి ఒక ఆస్తి. అక్కడక్కడ దీంట్లో మామూలు దోషాలు లేకపోలేదు కాని, కొన్నిపట్ల ఇది ఎంతో హృద్యంగా ఉంది. ఇటీవలి దిన్నీమాండలికమున్నూ అయిన పోతభాష వాడితే నేంపోయె , చేతభాష కుడా పాళం గానే పడింది. అతి తెలివి సంకర సమాసాలు బలే విరివిగానూ, మహా జోరుగాను, లేవని చెప్పలేం కాని, జటిలత్వం నిండుకుంది అనడానికీ వీలు లేదు. పాండిత్యంలో లోటుకీ కదలోని నీటుకీ ఉర్జీ సరిపోయింది. ఇది ఉత్తమోత్తమం అని వ్రాయజాలం కాని , దీన్నినీచ కావ్యం అని కొట్టిపారెయ్యడానికీ మనస్కరించకుండా ఉంది. మొదలు ఎట్లా ఉందో చివరంటా అంతే.
ఇట్లు
రసరాట్.
(ఇంకా ఉంది)